సోనియా గాంధీతో సమావేశం కానున్న అశోక్ గెహ్లాట్‌

Rajasthan Chief Minister Ashok Gehlot to meet Sonia Gandhi in Delhi today amid crisis in home state

న్యూఢిల్లీః రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. ఈ నేప‌ధ్యంలో ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో బుధ‌వారం ఢిల్లీలో స‌మావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ముందుగా అనుకున్న విధంగా గెహ్లాట్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంపై స్ప‌ష్ట‌త కొర‌వ‌డిన క్ర‌మంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆయ‌న భేటీకి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. గెహ్లాట్ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌డితే త‌దుప‌రి రాజ‌స్ధాన్ సీఎంగా స‌చిన్ పైల‌ట్‌ను ఎంపిక చేసే ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తూ ఆదివారం రాత్రి 80 మందికి పైగా గెహ్లాట్ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు స్పీక‌ర్ సీపీ జోషీకి రాజీనామా లేఖ‌లు అంద‌చేయ‌డం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపింది.

సీఎంగా గెహ్లాట్ సూచించిన వ్య‌క్తినే ఎంపిక చేయాల‌ని, 2020 జూన్‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నం జ‌రిగిన స‌మ‌యంలో పార్టీకి అండ‌గా నిలిచిన 102 మంది ఎమ్మెల్యేల్లో ఒక‌రిని సీఎంగా ప్ర‌తిపాదించాల‌ని వారు హైక‌మాండ్‌కు ష‌ర‌తులు విధించారు. రాజ‌స్దాన్‌లో రాజ‌కీయ ప‌రిణామాల‌ను చ‌క్క‌దిద్దేందుకు, గెహ్లాట్‌, పైల‌ట్ వ‌ర్గాల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు పార్టీ ప‌రిశీల‌కులుగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, అజ‌య్ మాకెన్‌ల‌ను కాంగ్రెస్ నియ‌మించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/