బాలకృష్ణ ఒక ఆటంబాంబ్ అంటూ అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో అఖండ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో అఖండ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను బోయపాటి తెరకెక్కించినట్లు చిత్ర ట్రైలర్ , టీజర్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్ శిల్ప కళావేదిక లో అఖండ ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా రాజమౌళి , అల్లు అర్జున్ హాజరై ఫంక్షన్ కు మరింత కళ తెచ్చారు.

ఈ వేడుక లో రాజమౌళి మాట్లాడుతూ..బాలకృష్ణ ఒక ఆటంబాంబ్ ఆ ఆటం బాంబ్‌ను ప్రయోగించడం బోయపాటి ఒక్కడికే తెలుసు. ఆ ఆటంబాంబును కరెక్ట్‌గా పేల్చడం బోయపాటి ఒక్కరికే తెలుసు. ఆ సీక్రెట్ మాకు కూడా చెబితే బాగుంటుందని నా ఫీలింగ్. ఆ సీక్రెట్‌ను అందరితో పంచుకొంటే హ్యాపీగా ఉంటుందని అనుకొంటున్నాను అంటూ అభిమానుల్లో జోష్ నింపారు.

సార్.. బాలయ్య గారు.. మీ ఎనర్జీ సీక్రెట్ కూడా చెప్పాలి. ఆ డ్యాన్సులు ఏంటి సార్.. ఆ ఎనర్జీ ఏంటి సార్. మనం చూసింది మచ్చుతునక మాత్రమే. సినిమాలో అఖండ ఎంట్రీ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలో చూస్తున్నా. అఖండ అద్భుతమైన విజయం సాధించాలి. ఇండస్ట్రీకి ఒక ఊపు తీసుకురావాలి అని రాజమౌళి చిత్ర యూనిట్ కు విషెష్ అందించారు.

అలాగే అల్లు అర్జున్ మాట్లాడుతూ..”బాలకృష్ణ ఈ లెవల్​లో ఉండటానికి రెండు కారణాలు. సినిమాపై ఆయనకు ఉన్న ఆసక్తి, డిక్షన్​. ఆయనలా డైలాగ్​లు ఎవరూ చెప్పలేరు. సీనియర్​ ఎన్టీఆర్​ తర్వాత ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. బాలయ్య ఎప్పుడు రియాలిటీగా ఉంటారు. కల్మషం లేని వ్యక్తి. ఆయనలో నాకు నచ్చే క్వాలిటీ అదే. అందుకే ఆయనకు ఇంత పెద్ద ఫ్యాన్ ​ఫాలోయింగ్​ ఉంది.​ ‘అఖండ’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమకు వెలుగునివ్వాలని ఆశిస్తున్నా. బోయపాటి శ్రీను గారంటే చాలా ఇష్టం. ‘భద్ర’ సినిమా నేను చేయాల్సింది. కానీ ఆర్య ఉండటం వల్ల అది కుదరలేదు. బోయపాటి కెరీర్​ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇష్టపడే వ్యక్తుల్లో ఆయనొకరు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ట్రైలర్​ చూస్తుంటే అర్థమైపోయింది.. సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అని. ప్రగ్యా జైస్వాల్​కు ఈ సినిమా కెరీర్​లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శ్రీకాంత్​ నాకు అన్నయ్యలాంటివారు. ఇక నుంచి మీరు కొత్త శ్రీకాంత్​ను చూస్తారు. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాను ప్రేమించినంతగా.. ప్రపంచంలో ఏ ప్రేక్షకులు కూడా ఏ సినిమాను తెలుగు వారిలాగా ప్రేమించలేరు. జై బాలయ్య అంటూ బన్నీ ముగించారు.