సౌండ్ వచ్చిందంటే అంతే సంగతి!

కుర్రకారు తమ బైకులతో రోడ్లై రయ్యిరయ్యిమంటూ దూసుకెళ్లడం మనం తరుచూ చూస్తుంటాం. అయితే ఒక్కోసారి మితిమీరిన వేగం ఈ కుర్రకారు ప్రాణాల మీదకు వస్తుంది. కాగా తమ వాహనాలను మరింత స్టైలిష్‌గా ఉంచేందుకు యువత వాటికి ఎలాంటి మార్పులు చేస్తారో మనకు తెలిసిందే. అయితే కొందరు మాత్రం తమ వాహనాలకు సంబంధించిన సైలెన్సర్‌ను భారీ శబ్ధం వచ్చేలా మార్పులు చేస్తుంటారు.

దీంతో మిగతా వాహనదారులతో పాటు పాదచారులకు కూడా పెద్ద తలనొప్పి వచ్చి పడుతుంది. ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న ఇలాంటి లౌడ్ సైలెన్సర్‌లకు చెక్ పెట్టేందుకు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు అడుగు ముందుకు వేశారు. ఇకపై భారీ శబ్దాలు వచ్చే లౌడ్ సైలెన్సర్‌లు ఉన్న బండ్లకు పెద్ద మొత్తంలో జరిమానా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. డిజిటల్ నాయిస్ లెవల్ మీటర్ ద్వారా వాహనాలను చెక్ చేసి 80 డెసిబెల్స్ కంటే అధికంగా శబ్దం వచ్చే వాహనాలకు జరిమానా వేయనున్నారు.

కాగా రాజమండ్రి నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇలాంటి వాహనాలను 70 గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు, వాటి సైలెన్సర్‌లను వేరు చేసి రోడ్డుపై రోడ్‌రోలర్‌తో తొక్కించారు. అంతేగాక ఒక్కో బండికి రూ.వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. ఇకపై ఇలాంటి లౌడ్ సైలెన్సర్‌లు కలిగిన బండ్లు తమకు చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.