మంత్రి జగదీశ్​రెడ్డి కి రాజగోపాల్ రెడ్డి సవాల్

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..టిఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి కి సవాల్ విసిరారు. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఉప ఎన్నిక ఫై కసరత్తులు చేస్తున్నాయి. ఎలాగైనా మునుగోడు లో విజయం సాధించి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ , బిజెపి పార్టీలు ప్రణాళికలు చేస్తుంటే..ఈ ఎన్నికల్లో గెలిచే రాష్ట్రంలో తిరుగులేదని మరోసారి నిరూపించుకోవాలని టిఆర్ఎస్ భావిస్తుంది.

ఈ తరుణంలో సోమవారం చౌటుప్పల్‌‌లో బీజేపీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భాంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..తాను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే మంత్రి జగదీశ్​రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన జగదీశ్ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు.

2014 ముందు సొంత ఇల్లు కూడా లేని జగదీశ్ రెడ్డి ఆస్తులు ఏడేండ్లలో వేల కోట్లకు ఎట్లా పెరిగాయనే దానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. శంషాబాద్ ఏరియాలో 70 ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించుకున్నాడని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి నీ ఆస్తుల చిట్టా బయట పెడితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. 2009 తర్వాత ప్రజాసేవ కోసం తాను ఆస్తులను అమ్ముకున్నానని, కాంట్రాక్టు పనులకు కక్కుర్తిపడే వ్యక్తిని కాదని రాజగోపాల్​రెడ్డి అన్నారు. రాజకీయంగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, ఇవన్నీ ప్రజలు గమనించి ధర్మం వైపు నిలబడతారని, తనను గెలిపిస్తారని అన్నారు. ఇక ఈ నెల 21 న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి..బిజెపి లో చేరనున్నారు.