సీఎం కేసీఆర్పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం..

టిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. రోడ్లు, డ్రైనేజీ పనులు కుంటుపడ్డాయని..తన రాజీనామాతో పెండింగ్ పనులు మొత్తం పూర్తవుతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ది బీజేపీ తోనే సాధ్యం అని నమ్మి కమలం పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. గత నాలుగేండ్లుగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలైన ఏ ఎమ్మెల్యే కి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఉప ఎన్నికలు వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, నియోజకవర్గం ప్రజలు రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మునుగోడులోనూ వస్తాయని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. విలువలకు కట్టుబడి ఉన్న రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఓటర్లు గెలిపిస్తారని, ఇక్కడి ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం మునుగోడులో కుర్చీ వేసుకొని కూర్చున్నా టీఆర్ఎస్ గెలవదన్నారు.

ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు కేసీఆర్ చాలా ఎత్తులు వేశారని, కొత్త పథకాలను కూడా అప్పటికప్పుడు పుట్టుకొచ్చాయన్నారు. మాయమాటలతో ప్రజలను గారడీ చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, తమ పార్టీలో అవినీతి లేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని బీజేపీతో పాటు ప్రజలందరూ అభినందిస్తున్నారని చెప్పారు.