తెలంగాణ లో మరో నాల్గు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు

తెలంగాణ రాష్ట్రాన్ని అకాల వర్షాలు వదలడం లేదు. గత పది రోజులుగా రాష్ట్రంలో పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులకు అపారనష్టం వాటిల్లుతుంది. పంట చేతికొచ్చే సమయంలో ఇలా వర్షాలు పడుతుండంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న , మామిడి , మిర్చి ఇలా పలు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇదిలా ఉండగానే మరో నాల్గు రోజులపాటు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో గరిష్ఠంగా 37 డిగ్రీల సెల్సియస్‌, కనిష్టంగా 25 డిగ్రీల సెల్పియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.