మరో రెండు రోజుల్లో మరో అల్పపీడనం..

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అనేక రహదారులు తిగిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని అంత కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. మరో రెండు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని తెలిపింది.

ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రెండు రోజుల క్రితం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఛత్రిగడ్ వైపు కదులుతుంది. ఈ అల్పపీడనం ప్రయాణించిన మార్గంలో 20 సే.మీ పైనే వర్షపాతం నమోదైంది. ఇక ఈ నెల 11న మళ్ళీ అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

నిన్న కురిసిన వర్షానికి కరీంనగర్ 15, వరంగల్ 20 కాలనీలు జలమయమయ్యాయి. గత ఏడాది 24 గంటల్లో హైదరాబాద్లో కురిసిన 20 సే.మీ వర్షపాతానికే జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే వరంగల్ లో 38 సే.మీ పైనే వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలతోపాటు.. ప్రధాన రహదారులు పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఇక నిన్న కురిసిన వర్షంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయాయి. ఈ తరుణంలో మరో అల్పపీడనం అనేది అందరిలో భయం పుట్టిస్తుంది.