తెలంగాణ లోని ఆ జిల్లాలో మూడు రోజుల పాటు వడగళ్ల వాన

గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతుల్లో కన్నీరు పెట్టించింది. మొక్కజొన్న, మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కాగా ఈ అకాల వర్షాలు మరో మూడు రోజుల పాటు ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

నేడు, రేపు ఎల్లుండి హైదరాబాద్‌ నగరంతో పాటు మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రుం భీం, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న, పెద్దపల్లి, జయశంకర్‌, భద్రాద్రి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది.