ఏపీకి రెయిన్ అలర్ట్..

ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం నుంచి వర్షాలు ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సోమవారం రాత్రి వరకు కడప జిల్లా సింహాద్రిపురంలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్లు, మంగళగిరిలో 7.7, ఎచ్చెర్లలో 7.6, మనుబోలులో 7.4, మారేడుమిల్లిలో 6.1, బాలాయపల్లిలో 5.8, విజయవాడ, గుడివాడల్లో 5.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇటు హైదరాబాద్ లోను సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఆగకుండా ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెహదీ పట్నం, టోలిచౌకి, అత్తాపూర్ తో పాటు మాసబ్ ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్ గంజ్ , హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్ , బంజారా హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో కుండపోత గా వాన కురిసింది.

కేవలం గంట వ్యవధిలో 10 సెం.మీ. వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, రోడ్లపై నుంచి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి.