విమాన ఛార్జీలతో పోటీపడుతున్న రైల్వే

RAILWAYS
RAILWAYS

విమాన ఛార్జీలతో పోటీపడుతున్న రైల్వే

న్యూఢిల్లీ: ఆదాయ వనరులే పరమార్ధం కాకుండా ప్రయాణికుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అనువైన పథకాలు రూపొం దించాలని రైల్వే శాఖకు కాగ్‌ (కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌) చురకలు వేసింది. భారత రైల్వే సంస్థ ప్రవేశపెట్టిన ‘అవసరానుగుణం గా ఛార్జీలు నిర్ణయించే పథకం (ఫ్లెక్సీ ఫేర్‌ స్కీమ్‌)పై పరిశీలించిన కాగ్‌ ఆ పథకానికి మార్పులు చేయాలని కోరింది. ప్రయాణీకులకు సౌకార్యలను పెంచకుండా రాబడులే ముఖ్యంగా భావించి ఇటీవలి కాలంలో రైల్వేశాఖ తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌, ఫ్లెక్సీఫేర్‌ విధానాలను ప్రవేశపెట్టింది.

ఇక ఎసి, థర్డ్‌ఏసి, ఫస్ట్‌ఎసి, సెకండ్‌ఎసి ఛార్జిలరూపంలోప్రయాణీకులకు విమానఛార్జిలకంటే ఎక్కువ వసూలుచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వరంగంలోని సంస్థలు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కంటేఆదాయమే పరమావధిగా పనిచేస్తున్నాయి. అందుకోసమే కాగ్‌ రైల్వేకు అక్షింతలు వేస్తూ పథకాలను సరిదిద్దాలని సూచించింది. సెప్టెంబర్‌ 2016 నుంచి రాజధాని,దురంతో, శతాబ్ధి రైళ్లలో ఈ పథకాన్ని భారత రైల్వే అమలు చేస్తోంది. ఈ పథకం ప్రకారం రైళ్లలో 10 శాతం సీట్ల వరకు టిక్కెట్‌ ధర యథావిధిగా ఉంటుంది. 10 నుంచి 20శాతానికి సీట్లు తగ్గిపోతే ఓ ధర, 20 నుంచి 30 శాతానికి తగ్గిపోతే మరో ధర, ఇలా ప్రతి 10శాతానికి కొంత శాతం ధర పెంచుతూ వెళ్తారు. ఈ పథకం అమలు చేశాక టికెట్ల అమ్మకం, రైళ్లలో ఆక్యుపెన్సీ తగ్గిందని కాగ్‌ పేర్కొంది.

అంతకుముందు రైళ్లలో ఖాళీ బెర్తులు 0.66 శాతం ఉండేవని, ఈ పథకం అమలు తర్వాత ఖాళీ బెర్తుల శాతం 4.46 శాతానికి పెరిగిందని తెలిపింది. అంతకు ముందు 2,47,36,469 మందిప్రయాణికులను ప్రతి రోజూ సంస్థ వారి గమ్య స్థానాలకు చేరవేసేదని ఇప్పుడా సంఖ్య 2,40,79,899కు తగ్గిందిని తెలిపింది.

అయితే ఈ పథకం రైల్వే సంస్థకు 2016 సెప్టెంబరు నుంచి 2017 జులై వరకు రూ.553 కోట్ల లాభం ఆర్జించి పెట్టినట్లు కాగ్‌ తెలిపింది. బెర్తులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య మాత్రం 2.65శాతం పతనమైనట్లు తెలిపింది. లాభంతోపాటు ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగేట్లు పథకానికి మెరుగులుదిద్దాలని కాగ్‌ భారతీయ రైల్వేస్‌కు సూచించింది.

బస్సులు, విమానాల్లో అధిక ఛార్జీలు భరించలేకే జనం ప్రయాణ సమయం కొంత పెరిగినప్పటికీ రైళ్లపై ఆధారపడతారని, ఇలా ఛార్జీలు పెంచితే వారు తిరిగి ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తారని చెప్పింది. కొన్ని మార్గాల్లో విమాన ఛార్జీలకంటే రైల్వే ఛార్జీలే అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. 13 రూట్లలో విమాన ప్రయాణానికి ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకుంటే అది రైల్వే ఛార్జీల కంటే తక్కువే అవుతుందని కాగ్‌ వివరించింది.