మొదటి రోజు తెలంగాణలో ముగిసిన రాహుల్ యాత్ర

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి రోజు తెలంగాణ లో విజయవంతంగా ముగిసింది. తొలి రోజు 4 కిలోమీటర్లు రాహుల్ నడిచారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్ పోస్టు వద్ద కు ఉదయం రాహుల్ చేరుకున్నారు. అక్కడి నుండి నాల్గు కిలోమీటర్ల వరకు రాహుల్ తన పాదయాత్రను కొనసాగించారు. టైరోడ్డులో యాత్ర ముగించి రాహుల్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు.

భారత్ జోడో యాత్ర తెలంగాణలో మొత్తం 12 రోజులు 375 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. నవంబర్ 7వ తేదీన కామారెడ్డిజిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని శాఖాపూర్ లో రాష్ట్రంలో యాత్ర ముగుస్తుంది. రాహుల్ రోజుకు 20 నుంచి 25 కిలో మీటర్ల మేర ప్రజలతో మమేకమవుతూ యాత్రలో పాల్గొంటారు. పలు ప్రధాన ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. దీపావళి సందర్బంగా మూడు రోజులు తన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి 27 న రాహుల్ తన యాత్రను కొనసాగిస్తారు.