రెండో రోజు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు రాహుల్​కు సంఘీభావం తెలిపారు. ముఖ్యనేతలనే ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఇతర కాంగ్రెస్ నేతలను లోనికి వెళ్లనియకుండా అడ్డుకున్నారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుదిరగాల్సి వచ్చింది. అదేసమయంలో, మాన్ సింగ్ రోడ్ సర్కిల్​పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఆందోళన చేస్తున్న కొంతమంది కాంగ్రెస్ ఎంపీలను దిల్లీ పోలీసులు నిర్బంధించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాను సైతం అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీ లుటియన్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్ నివారించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం వరకు ఏఐసీసీ, ఈడీ కార్యాలయాలకు వెళ్లే దాదాపు అన్ని మార్గాలను పోలీసులు మూసేశారు. కాంగ్రెస్ శ్రేణుల నిరసనలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, మంగళవారం అలాంటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ గాంధీ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత ట్రాఫిక్‌ సాధారణంగా సాగేందుకు పలు మార్గాల్లో వాహనాలను అనుమతించనున్నట్లు వెల్లడించారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/