రాహుల్ తో ముగిసిన టీ కాంగ్రెస్ నేతల భేటీ

టీ కాంగ్రెస్ నేతలు ఈరోజు సోమవారం ఢిల్లీ లో రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సమావేశమైన వీరు..అనేక విషయాల ఫై చర్చించారు. సమావేశంలో 39 మంది కాంగ్రెస్‌ నేతలు , రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు హాజరయ్యారు. భేటీ అనంతరం మీడియా సమావేశమై..సమావేశంలో ఏ విషయాలు మాట్లాడారో తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో ఒకటి రెండు చోట్ల రేవంత్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేసారని… జిల్లా నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అభ్యర్థుల ప్రకటనకు అధిష్ఠానం అనుమతి ఇచ్చిందా అని రాహుల్ గాంధీని అడిగినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.

పార్టీలో ఉన్న వివాదాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇక నుంచి వివాదాలు లేకుండా ముందుకు వెళ్తామని ఉత్తమ్ తెలిపారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంతో ఎలాంటి చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీని ఓడించి తెలంగాణలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోపక్క రాహుల్ తో జరిగిన సమావేశానికి హాజరైన జగ్గారెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాసిన జగ్గారెడ్డి.. ఇవాళ రాహుల్‌ గాంధీ నిర్వహించిన కీలక భేటీకి హాజరైన తర్వాత మనస్సు మార్చుకున్నారు.. రాహుల్ గాంధీని చూసిన తర్వత.. గతంలో ఏం మాట్లాడినా..? అనేది మర్చిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.