సెలబ్రిటీని కొట్టాం అనిపించుకోవడానికే ఈ దాడి

తనపై జరిగిన దాడిపై స్పందించిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Rahul Sipligunj
Rahul Sipligunj

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌-3 విన్నర్‌, ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ పై జరిగిన దాడి సంచలనం సృష్టించింది. ఓ అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తుండడాన్ని ప్రశ్నించిన రాహుల్ పై ఈ దాడి జరిగినట్టు ప్రాథమిక సమాచారం. దీనిపై రాహుల్ స్వయంగా వివరణ ఇచ్చారు. కొందరు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన స్నేహితురాల్ని మాటలతో వేధిస్తున్న ముగ్గుర్ని తాను నిలదీశానని, అయితే మాటలు పెరగడంతో రితేశ్ రెడ్డి అనే యువకుడు తనను కొట్టాడని రాహుల్ వెల్లడించారు. రాహుల్ సిప్లిగంజ్ లాంటి సెలబ్రిటీని కొట్టాం అని చెప్పుకోవడానికే రితేశ్ రెడ్డి తదితరులు ఈ దాడి చేసినట్టు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

ఘటన సమయంలో ఇద్దరు బౌన్సర్లు ఉన్నా వారు నిస్సహాయుల్లా మిగిలిపోయారని తెలిపారు. ఈ విషయంలో తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం పట్ల ఎంతో ఆగ్రహం కలుగుతోందని, కానీ కొన్ని విషయాలు మీడియా ముందు మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రితేశ్ రెడ్డి వాళ్ల అన్న టీఆర్ఎస్ పార్టీ నేత అని తెలిసిందని, అయితే తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పబ్ లో జరిగిన దాడి సమయంలో తాను ఆవేశానికి లోనవడం నిజమేనని అన్నారు. కాగా, మీడియా సమావేశంలో కెమెరాలు క్లోజప్ షాట్ చిత్రీకరించిన సమయంలో రాహుల్ ముఖంపై గాయాలు స్పష్టంగా కనిపించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/