ఈడీ ఆఫీస్ కు చేరుకున్న రాహుల్..

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈరోజు (జూన్ 13) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్.. రాహుల్ వెంట ర్యాలీగా వచ్చారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ లో రాహుల్ ను అధికారులు విచారిస్తున్నారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీస్ ల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అగ్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, సిడబ్ల్యూసి మెంబర్లు, మద్దతు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. రాహుల్ కు సంఘీభావంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, జైరాం రమేష్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, గౌరవ్ గొగోయ్ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లోకి ఎక్కించారు. ఈ మేరకు ఏఐసీసీ ఆఫీస్ ముందు, రాహుల్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ ఆఫీస్ ముందు 144 సెక్షన్ విధించారు.

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ తో సోనియా కు సైతం ఈడీ నోటీసులు అందజేశారు. సోనియా గాంధీ కోవిడ్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందునా.. ఆమెను ఈ నెల 23 న హాజరుకావాలని సూచించింది. ఈడీ నోటీసుకు మరియు నియంత యొక్క అహంకారానికి రాహుల్ గాంధీ భయపడరు అని కాంగ్రెస్ ఆదివారం రాత్రి ఒక ట్వీట్‌లో పేర్కొంది. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. తమ మాజీ పార్టీ అధినేత వెనక్కి తగ్గరని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు ఎంపీలు పేర్కొన్నారు. ఈడీ చర్య “నిరాధారమైనది” అని కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం పేర్కొన్నారు.