తెలంగాణ నుండి రాహుల్ పాదయాత్ర..?
2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాలను కలుపుతూ రాహుల్ పాదయాత్ర చేయాలనీ చూస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. సెంటిమెంట్‌గా యాత్రను తెలంగాణలో ప్రారంభిస్తే బాగుంటుందన్న విషయాన్ని పార్టీ పెద్దలకు చెబుతామని తెలిపారు.
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. చింతన్ శిబిర్ లో తీసుకున్న అన్ని అంశాలను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానంతో సోనియా గాంధీకి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు విజయవంతంగా చేశామన్న రేవంత్..సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గాంధీభవన్ లో సమాచారం అందించాలన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ ను జనం లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్. రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజలతో చర్చించాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు.