చంచల్ గూడ జైల్లో NSUI నేతలను పరామర్శించిన రాహుల్

రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్.. ఈరోజు చంచల్ గూడ జైల్లో NSUI నేతలను పరామర్శించారు. NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 17మంది NSUI నేతలు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ వారిని పరామర్శించారు. బల్మూరి వెంకట్​తో పాటు మరికొందరు కార్యకర్తలతో మాట్లాడిన రాహుల్​.. వారికి ధైర్యం చెప్పారు. అధైర్యపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. కష్టపడి పనిచేస్తుంటే పార్టీ అండగా ఉంటుందని భరోసా వారికి కల్పించారు. రాహుల్ వెంట మాణిక్క ఠాగూర్, రేవంత్, ఉత్తమ్, భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.

రాహుల్ రాకతో.. చంచల్ గూడ జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మరికాసేపట్లో రాహుల్ గాంధీభవన్ లో పీసీసీ నేతలతో సమావేశమై.. పార్టీ అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళతారు రాహుల్. ఇక నిన్న రాహుల్ వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలను పరామర్శించారు. రైతు డిక్లరేషన్ ను ప్రకటించి.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తితో పొత్తుల ఉండబోవని స్పష్టం చేశారు. వరంగల్ నుంచి రాత్రి హైదరాబాద్ చేరుకున్న రాహుల్ తాజ్ కృష్ణా హోటల్ లో బస చేశారు. ఉదయం ఉద్యమ నేతలతో భేటీ అయ్యారు. గద్దర్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్.పురుషోత్తమ్, జహీర్ అలీ ఖాన్, చెరుకు సుధాకర్, అడ్వకేట్ జేఏసీ వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ జానయ్య, కంచె అయిలయ్య, మురళీ మనోహర్, ప్రొఫెసర్ హరగోపాల్ రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరయ్యారు.