కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగంపై రిజిజు ఆగ్రహం

దేశ సమగ్రతకు ప్రమాదకరంగా మారాడని విమర్శ

Rahul Gandhi provoking people to divide India, foreigners don’t know ‘Pappu’: Kiren Rijiju

న్యూఢిల్లీః బిజెపి నాయకుడు, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాహుల్ గాంధీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ సమగ్రతకు రాహుల్ అత్యంత ప్రమాదకరంగా మారారని, భారతదేశాన్ని విభజించడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. యూకే పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగం వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన రిజుజు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

‘కాంగ్రెస్ పార్టీకి స్వయం ప్రకటిత యువరాజు అయిన ఈ వ్యక్తి (రాహుల్) అన్ని పరిమితులను అధిగమించారు. భారతదేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరంగా మారారు. ఇప్పుడు దేశాన్ని విభజించడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకైక మంత్రం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

కాగా, రాహుల్ గాంధీ తన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రసంగంలో ప్రధాని మోడీ భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని రిజిజు అన్నారు. అయితే భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చడానికి దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి ప్రకటనలను దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పారు. ‘రాహుల్ గాంధీ పప్పు అని భారత ప్రజలకు తెలుసు కానీ విదేశీయులకు ఆయన పప్పు అని తెలియదు కదా’ అని ఎద్దేవా చేశారు.