తెలంగాణ లో 12 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 07 నుండి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3,500 కిలోమీటర్లకుపైగా సాగనుంది. కేరళలో 19 రోజులు, కర్ణాటకలో 21 రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలోకి అడుగుపెట్టనున్నారు.

12 రోజులపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా సుమారు 300-350 కిలోమీటర్ల మేర సాగనుంది. రాయచూర్‌ మీదుగా నారాయణపేట నియోజకవర్గంలోకి రానున్న రాహుల్‌ యాత్ర కొడంగల్, పరిగి, వికారా­బాద్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్‌ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. బిచ్కుంద, మద్నూరు మీదుగా మహారాష్ట్రలోని డిగ్లూర్‌కు వెళ్లేలా రూట్ మ్యాప్ తయారుచేశారు.

ఇదిలా ఉంటె..కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హెల్త్ చెకప్ కోసం మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కూడా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలియజేసింది. సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగే ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు.