పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు రాహుల్‌ గాంధీ దూరం..!

రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎవరన్నదానిపై ఉత్కంఠ

Rahul Gandhi, Other Congress Leaders May Skip Winter Session

న్యూఢిల్లీః ఈ సారి జరగబోయే శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌తోపాటు పలువురు నాయకులు కూడా ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ.. భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ… ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే వీరంతా సమావేశాలకు దూరంగా ఉండి యాత్రను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 7వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) సాయంత్రం 4గంటలకు కాంగ్రెస్‌ పార్టీ వ్యహాత్మక కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన మల్లికార్జున ఖర్గే.. పోటీ చేసిన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజ్యసభలో తదుపరి కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత ఎవరు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే అవకశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/