మొదటి రోజు రాహుల్‌ విచారణ పూర్తి..

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ని ఈడీ అధికారులు సోమవారం దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు రాహుల్ గాంధీ ఈడీ కార్యాల‌యానికి వెళితే… రాత్రి 9.30 గంట‌ల‌కు ఆయ‌న ఈడీ కార్యాల‌యం నుంచి బయటకు వచ్చారు. మ‌ధ్యాహ్నం ఓ గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు…రాహుల్‌ను ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. ఇక ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదని , రేపు మంగళవారం కూడా ఈడీ ఆఫీస్ కు రావాల్సి ఉంటుందని రాహుల్ కు సమన్లు జారీ చేసారు.

మొదటి రోజు సుదీర్ఘంగా సాగిన‌ విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ ఫై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్లు స‌మాచారం. ఈడీ అధికారులు అడిగిన దాదాపుగా అన్ని ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ లిఖిత‌పూర్వ‌కంగానే స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ స‌మాధానాల‌ను ఆయ‌న వ్య‌క్తిగ‌త సాక్ష్యాలుగా ప‌రిగ‌ణించే దిశ‌గా ఈడీ అధికారులు నిర్ణ‌యించిన‌ట్లు వినికిడి. మరోపక్క
రాత్రి 8.30గం. కావస్తున్నా.. రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారిస్తుండ‌టంతో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగింది. పార్టీకి చెందిన సీనియ‌ర్లు ఖంగారుగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అనే కోణంలోనూ సమాలోచనలు జరిపారు. ఈ తరుణంలో రాహుల్‌ ఈడీ ఆఫీస్‌ నుంచి బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి రాహుల్ నేరుగా నివాసానికి వెళ్లిపోయారు.