కాంగ్రెస్‌కు మరో సవాల్‌ పంచాయతీ ఎన్నికలు

RAHUL GANDHI
RAHUL GANDHI

కాంగ్రెస్‌కు మరో సవాల్‌ పంచాయతీ ఎన్నికలు

హైదరాబాద్‌ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మంచి ఊపు మీదనున్న తెలంగాణ రాష్ట్ర సమితి, వచ్చే పంచాయతీ ఎన్నికల్లోనూ అదే స్థా యిలో పోరాడేందుకు సంసిద్ధమౌతున్నది. గ్రామస్థాయిలో కార్య కర్తల బలంపెంచుకునేందుకు ఉపకరించే ఆ ఎన్నికల విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ అధిక ప్రాధాన్యతనిస్తుంటాయి. అయితే అంచనాలు తారుమారై, ఇంకా కోలుకోని కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సం వత్సరంలో వస్తున్న పంచాయతీ ఎన్నికలు పెనుసవాల్‌గా ముందు కు వస్తున్నాయి. కోర్టుతీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వెం టనే జరుపుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటిం చడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈమేరకు చర్యలు ప్రారంభిం చింది. సాధారణంగా స్థానికసంస్థల ఎన్నికలలో ఫలితాలు అధికార పార్టీలకు అనుకూలంగా ఉంటాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ కింది స్థాయిలోనే పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ ఎన్నికలు అన్ని పార్టీలకూ ఎంతో కీలకంగా మారతాయి.

పాత ఖమ్మం జిల్లా మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఇటీవలే ముగిసిన అసెం బ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించినందున మరింత ఉత్సాహంతోనే ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు తగిన కార్యా చరణతో ప్రణాళికరచన చేస్తున్నది. తెలంగాణలో సమీప ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో అవకాశం లభించకుండా టిఆర్‌ఎస్‌ నాయకత్వం అన్నిచర్యలకూ ఇప్పటినుంచే ప్రారంభిం చింది. టిఆర్‌ఎస్‌ పార్టీకి శాసనసభ్యుల ప్రాతినిధ్యం ఖమ్మం జిల్లా ల్లోనూ పెంచుకుని స్థానిక సంస్థలో విజయం సాధించేలా ఎమ్మె ల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానించడంకూడా ప్రారంభమైంది. వైరా నియోజకవర్గం నుంచి ఇటీవలే ఎన్నికైన రాముల్‌ నాయక్‌ను పార్టీ లోకి చేర్చుకుని పార్టీబలాన్ని ఆ జిల్లాల్లో పెంచుకున్నారు. రాములు నాయక్‌ కాంగ్రెస్‌ టికెట్‌ లభించకపోవడంతోనే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడి విజయం సాధించి టిఆర్‌ఎస్‌లో చేరడం గమనార్హం.

దీంతో కాంగ్రెస్‌కు రెండురకాలుగా ఇబ్బంది కలుగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగానే శాసనసభ్యుడిగా గెలుపు సాధించిన రాములునాయక్‌ సామర్థ్యాన్ని కాంగ్రెస్‌ గుర్తించలేక పోవడంవల్ల ఆయన గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో వచ్చే స్థా నిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయనవల్ల టిఆర్‌ఎస్‌కు ప్రయోజనం కలుగనుంది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇతర పక్షాల తోడ్పాటు తీసుకున్నప్పటికీ ఫలతాల వద్ద బోర్లాపడటంతో తర్వాతి ఎన్నికల్లోనూ పలు పరీక్షలను ఎదుర్కొనకతప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నికల్లో పరాజయానికి క్షేత్రస్థాయిలో పార్టీని సమర్థంతంగా నడపకపోవడంవంటి కారణాలను కాంగ్రెస్‌ ఇంకా సమీక్షించుకున్నట్లుగా లేదు.

ఫలితాలు వెల్లడైన తర్వాత వచ్చిన ఓటమినికూడా పార్టీనేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. దా దాపుగా విజయం సాధించమని, ముఖ్యమంత్రితోపాటు మంత్రివర్గ ఇతర సభ్యులెవరెవరంటూ అంచనాలతో కలలుకన్న పార్టీ నేతలు తమముందు పరాజయం కనిపిస్తున్నా, తమ ఓటమికి దా రితీసిన పరిస్థితులపైపూర్తిస్థాయి అధ్యయనంకూడా చేసు కోవడం లేదనే విమర్శలున్నాయి. పైగా కూటమి ఏర్పాటు కంటే సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దన్న పాత్ర వహించిన కాంగ్రెస్‌ చర్యలు ఇతర పార్టీలోనూ అసంతృప్తిని పెంచింది. ముఖ్యంగా సిపిఐ, టిజెఎస్‌ పార్టీలు సీట్ల సర్దుబాటు విషయంలో తమ పార్టీలకు అన్యాయం జరిగిందని బహిరంగంగా ప్రకటించినా అవి పోటీ చేసిన ఏ సీటును గెలువలేకపోయాయి.

భాగస్వామ్య పక్షాలకు వాటి బలం-బలగం విషయంలో సర్వేలు చేసిన తర్వాతనే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించాలో నిర్ధారించినట్లుగా కాంగ్రెస్‌ ఆనాడే ప్రకటించినప్పటికీ సీట్ల పంపిణీ విషయంలో సుదీర్ఘ సమయం తీసుకొని ఎన్నికల బరిలోకి కూటమిని సకాలంలో దించలేకపోయింది. తెలంగాణలో తమ ఉనికిని కాపాడుకునేందుకు తక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. అయితే సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో కాని ఎన్నికలకు ఎంతో ముందుగానే సీట్ల పంపిణీకి తగిన సమాచారం సర్వే ద్వారా తీసుకున్నట్లుగా చెప్పిన కాంగ్రెస్‌ నేతలు ఎందుకో ప్రజల నాడిని సరిగ్గా అంచనా వేసినట్లుగా లేరనే ఆరోపణలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నా, తెలంగాణ ఎన్నికల ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్రానికి వచ్చి ఒక ఎన్నికల ప్రచార సభలోనూ మాట్లాడి వెళ్లారు. దేశంలోని అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా, ఆమె కేవలం తెలంగాణకు మాత్రమే వచ్చి తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన కృషిని ప్రజలకు వివరించి వెళ్లారు. అయినప్పటికీ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో సోనియా పర్యటన కూడా ఉపకరించలేదు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత వస్తున్న స్తానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ కొంత కష్టపడాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

పైగా లోక్‌సభ ఎన్నికలు కూడా మరో రెండు,మూడు నెలల్లోనే రాబోతున్న నేపథ్యంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. క్షేత్ర స్థాయి కార్యకర్తల పెంపుదలకు, పార్టీ నిర్మాణాన్ని పెంచుకోవడానికి ఉపకరించే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయవంతంగా ప్రయత్నాలు చేసుకోనట్లయితే లోక్‌సభ ఎన్నికల్లోనూ విషమ పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడి ప్రభ మసకబారు తుందనేప్రచారం నేపథ్యంలో బిజెపికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలను ఒక్కతాటిపైకి తేవడానికి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం కూడా సహకరించి,తెలంగాణ నుంచి కొన్ని లోక్‌సభ సీట్లు అందించి బలం పెంచడానికి ప్రత్యేక కృషి చేయాల్సిన అవరసం ఉంది.

ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితే అవి నేరుగా లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయి. వార్డు స్థాయి సభ్యులను పెంచుకుంటేనే కాంగ్రెస్‌ బలోపేతం కావడానికి వీలు అవుతుంది. కూటమి కొనసాగుతుందా? మారిన పరిస్థితుల్లో తిరిగి కూటమిలోని ఇతర పక్షాలను కూడా భాగస్వాములను చేసుకొని స్థానిక సంస్థల సమరానికి కాంగ్రెస్‌ సిద్ధం అవుతుందా లేక ఒంటరిగానే ఈ ఎన్నికలకు సిద్ధం అవుతుందా అనేది పార్టీ ప్రకటించాల్సి ఉంది.

ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తుకు ఇతర పార్టీలు ఇష్టపడుతాయా లేదా అనేది కూడా ప్రశ్నార్ధకమే. కానీ లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వస్తున్నందున వారి మిత్రత్వం కొనసాగడమే మేలనే విషయంలో కాంగ్రెస్‌ తిరిగి చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. పైగా జాతీయ స్థాయిలో సయోధ్యకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా చొరవ తీసుకుంటున్నందున టిడిపి నేతలు స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు సుముఖత ప్రకటించే అవకాశాలున్నాయి. సిపిఐ కూడా జాతీయ పరిస్థితుల దృష్ట్యా బిజెపికి వ్యతిరేకంగానే లోక్‌సభ ఎన్నికల వరకు పీపుల్స్‌ ఫ్రంట్‌లో కొనసాగనుంది. అయితే తెలంగాణలో స్వంతంగా రాజకీయ పార్టీగా ఎదగడానికే కోదండరాం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న టిఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేమని భావించి తన పార్టీని కూడా కూటమి భాగస్వామ్యంగా చేర్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కోదండరాం కూడా తన పార్టీ పరిస్థితిని సమీక్షించుకోక తప్పదు.

పార్టీ అభ్యర్థులెవరూ గెలువక పోగా కనీస ఓట్లుకూడా రాలేదు. దీంతో స్థానిక సంస్థలు లేదా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ టిజెఎస్‌ ఒంటరిగా వెళ్లి తెలంగాణలో పటిష్టంగా ఉన్న టిఆర్‌ఎస్‌తో ఢీకొనే ప్రయత్నం కోదండ రాం ఆలోచన చేయడం కూడా కష్టమే. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దెదింపాలని ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గట్టిగా ఆలోచించిన కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజెఎస్‌లు తిరిగి ఏకతాటిపై నిలిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో కొంతవరకైనా పోరాడటం సాధ్యపడుతుంది.

ఈ మేరకు స్థానిక ఎన్నికలు కూడా టిఆర్‌స్‌ వ్యతిరేకంగా ఉన్న అన్ని పక్షాలకు పెద్ద పరీక్షగానే ఉంటుంది. సిపిఎం కూడా ఇతర పక్షాలతో కలువకుండా స్వంతంగా కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. దీంతో ఆ పార్టీలో మార్పు వస్తుందోలేదో తేలాలి. అయితే జాతీయ స్థాయి నిర్ణయంపైనే రాష్ట్ర సిపిఎం నేతలు భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. కాగా తెలంగాణ బిజెపికి కూడా అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దేశ ప్రధాని మోడి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు తెలంగాణలో బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి ఎంతవరకు లాభం కలుగుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాష్ట్ర సీనియర్‌ నేతలు కూడా ఓటమి పాలు కావడంతో తెలంగాణ బిజెపి పరిస్థితి పూర్తిగా దిగజారింది.