జడ్చర్ల సభలో బిజెపి , టిఆర్ఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్

భారత్ జోడో యాత్ర లో భాగంగా తెలంగాణలో నాల్గో రోజు పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ..జడ్చర్లలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ బిజెపి , టిఆర్ఎస్ పార్టీల ఫై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నల్లచట్టాలకు సీఎం కేసీఆర్ మద్దతిచ్చారని అన్నారు. అన్నదమ్ముల్లాంటి దేశ పౌరుల మధ్య బీజేపీ కొట్లాటలు పెట్టిస్తోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో హింసా, ద్వేషాలను నిర్మూలించేందుకే కన్యాకుమారీ నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నానని వివరించారు. చేనేత కార్మికులు సంక్షోభంలో ఉన్నారని తెలిసినా వారిపై కేంద్ర సర్కారు 12 శాతం జీఎస్టీ మోపిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులు జీఎస్టీ చెల్లిస్తున్నందుకు పరిహారాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మోడీ సర్కార్ ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు పరం చేసి దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెడుతోందన్నారు.

తెలంగాణ లో రైతులు, ఆదివాసీలు, దళితులు, గిరిజనుల భూములను గుంజుకునే పనిలో కేసీఆర్ ఉన్నడన్నారు. టీఆర్ఎస్ సర్కారు నిరంకుశ విధానాల వల్ల తెలంగాణలో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదన్నారు. కేసీఆర్ సర్కారు తెలంగాణలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, నిరుద్యోగ సమస్యను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు చెప్పి పేదల భూములను కేసీఆర్ లాక్కొంటున్నాడని మండిపడ్డారు.

ఇదిలా ఉంటె నవంబర్ 1న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లో రాహుల్ యాత్రకు సంబంధించిన వివరాలను అంజన్ కుమార్ మీడియాకు తెలిపారు . నవంబర్ ఒకటో తేదీ ఉదయం శంషాబాద్ నుంచి ఆరంఘర్ వరకు రాహుల్ పాదయాత్ర ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటలకు చార్మినార్ కు చేరుకుంటారని, అక్కడ రాజీవ్ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. తర్వాత పాత బస్తీ మీదుగా గాంధీ భవన్ కు చేరుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి అసెంబ్లీ, సెక్రటేరియట్ మీదుగా నెక్ లెస్ రోడ్డులోని ఇంధిరాగాంధీ విగ్రహం వద్దకు రాహుల్ పాదయాత్ర చేరుకుంటుందని స్పష్టం చేశారు. అక్కడ రాహల్ సభ జరగునుందని తెలిపారు. అక్కడి నుంచి బోయినిపల్లికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అలాగే నవంబర్ 2వ తేదీన బాలానగర్ చౌరస్తా నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా నగరం దాటి వెళ్తారని ఆయన చెప్పారు.