మహిళలతో కలిసి రాహుల్ డాన్స్

తెలంగాణ రాహుల్ భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ముఖ్యముగా ఈ పాదయాత్ర లో ఆసక్తికర ఘటనలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. రాహుల్ ఎక్కడ కూడా తగ్గిదేలే అన్నట్లు ఉత్సహంగా పాదయాత్ర చేయడమే కాదు కార్య కర్తల్లో జోష్ నింపుతున్నారు. మొన్న పిల్లలతో పరుగులు పెట్టించడం..నిన్న రోడ్ ఫై క్రికెట్ ఆడడం..ఈరోజు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కొరడాతో కొట్టుకుంటూ హలచల్ చేయడం అందరి ఆకట్టుకుంది.

ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో తొమ్మిదో రోజు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాద యాత్ర చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి నిన్న యాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు వెంట వస్తుండగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఈ ఉదయం చాలా ఉత్సాహంగా కనిపించారు.

ఉదయం చిన్న పిల్లలతో కాసేపు కరాటే ఆడిన ఆయన.. తనకు స్వాగతం పలికిన గిరిజన మహిళలతో కలిసి డాన్స్ వేశారు. రాహుల్ తో కలిసి రేవంత్, సీతక్క, జగ్గారెడ్డి కాలు కదిపారు. అలాగే, బోనాల ముంగిట పోతురాజుల విన్యాసం కూడా రాహుల్ చూశారు. తెలంగాణలో సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతకు వివరించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కొరడాతో కొట్టుకుంటూ హల్‌చల్‌ చేశారు రాహుల్ గాంధీ. దీంతో.. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల్ని తెలుసుకుని వాటిని ఆచరించి చూపారు. అంతకుముందు ఉదయం రుద్రారం నుంచి నడక ప్రారంభించిన రాహుల్..పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఓ హోటల్‌కు వెళ్లి టీ తాగుతూ.. అక్కడి వాళ్లతో కాసేపు ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా రాహుల్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చారు. పలువురు విద్యార్థులు కూడా ఆయన వెంట ఉత్సాహంగా నడకలో పాల్గొన్నారు.. వారితో మాట్లాడుతూ..సంతోషంగా ముందుకు సాగుతూ..దారిలో గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. రాహుల్‌ పాదయాత్ర చేస్తూ.. దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. ఎక్కడా ఆయన అలసిపోయినట్లు కనిపించలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో పరిగెత్తుతున్నారు. ఒక దశలో వెంట నడుస్తున్న వారే.. ఆయనతో పరిగెత్తలేక నీరసపడుతున్నారు.. రాహుల్‌ మాత్రం నడుస్తూ..నవ్విస్తూ..జోష్‌నింపుతూ యాత్రలో అన్నీ తానై ముందుకెళ్తున్నారు.