జగన్‌పై మరోసారి రెచ్చిపోయిన ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై మరోసారి నిప్పులు చెరిగారు ఎంపీ రఘురామా కృష్ణం రాజు. తన నియోజకవర్గానికి తాను వెళ్తానంటే జగన్‌కి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్ధం కావడం లేదన్నారు. రఘురామకృష్ణరాజు తన రాష్ర్టానికి రావద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నట్లు సహచర ఎంపీలు తనకు చెప్పారని.. రాష్ట్రం ఏమైనా జగన్ సొంతమా? అని ప్రశ్నించారు.

‘లా జస్టిస్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ’ వైజాగ్ లో సమావేశం కావాల్సి ఉందని, ఈ విషయాన్ని కమిటీ సభ్యులు రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లగా… కమిటీలో రఘురామరాజు ఉంటే ఆ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తనకు తెలిసిందన్నారు. రఘురామ విశాఖ వస్తే అరెస్ట్ చేస్తామని.. ఆ తర్వాత కమిటీ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తుందని డీజీపీ హెచ్చరించినట్లు ఆరోపించారు. ఒక ఎంపీ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్‌ చేశారు. తనను అడ్డుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసే బరితెగింపు చర్యలకు జగన్ దిగుతున్నారని మండిపడ్డారు.

ఇక జులై లో తన నియోజకవర్గంలో ప్రధాన మంత్రి మోదీ పర్యటించనున్న నేపథ్యంలో.. అక్కడి కార్యక్రమంలో హాజరు కావాలనుకుంటున్న తనకు తగిన భద్రత కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌, హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాను కలిశారు. రెండేళ్లుగా రాష్ట్రానికి, తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని.. ఇప్పుడు పార్లమెంటు స్థాయి సంఘం పర్యటనకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. వచ్చే నెల 4న ప్రధాని తన నియోజకవర్గ పర్యటనకు రానున్న నేపథ్యంలో… తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉన్నందున.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. తగిన భద్రత కల్పించాలని హోంశాఖ సహాయ మంత్రి, కార్యదర్శిలను కోరారు.