లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

తనపై దాడిచేసిన సీఐడీ పోలీసుల పేర్లను లేఖలో రాసిన రఘురామ

MP Raghurama krishna Raju
raghurama-krishna-raju-

అమరావతి : ఏపీ సీఐడీ పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అందులో తనపై దాడిచేసిన పోలీసుల పేర్లను కూడా రాసుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సూచనలతో గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్, డీఐజీ సునీల్ నాయక్, ఏఎస్పీ విజయ్ పాల్, ఏఎస్సై పసుపులేటి సుబ్బారావు, కానిస్టేబుల్ మల్లేశ్వరరావు తనను చిత్రహింసలు పెట్టారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఐదుగురిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

పీవీ సునీల్ కుమార్‌పై గృహహింస కేసుతోపాటు పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని, సునీల్ నాయక్, విజయ్‌పాల్ ఇద్దరూ ఉద్యోగ విరమణ చేసినా రెండేళ్లుగా ఓఎస్డీలుగా కొనసాగుతున్నారని రఘురామ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తనను సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలించారని అన్నారు. అక్కడి నివేదికతోనే తనకు బెయిలు వచ్చిందని ఆ లేఖలో రఘురామ గుర్తు చేశారు. తనను చిత్రహింసలకు గురిచేసిన విషయమై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీకి ఉన్న అధికారాలతో తనను చిత్రహింసలకు గురిచేసిన ఐదుగురిని వెంటనే పిలిపించి విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. విచారణను ఆలస్యం చేస్తే పార్లమెంటుపై ఉన్న గౌరవం తగ్గిపోతుందని అన్నారు. రఘురామ రాసిన ఈ లేఖను చర్యల నిమిత్తం కేంద్ర హోంశాఖకు పంపినట్టు సిబ్బంది, శిక్షణ  వ్యవహారాల విభాగం తెలిపింది.