తనకు భద్రత కల్పించాలంటూ కేంద్రాన్ని కోరిన రఘురామ

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ తనకు భద్రత కల్పించాలంటూ కేంద్రాన్ని కోరారు. జులై లో తన నియోజకవర్గంలో ప్రధాన మంత్రి మోదీ పర్యటించనున్న నేపథ్యంలో.. అక్కడి కార్యక్రమంలో హాజరు కావాలనుకుంటున్న తనకు తగిన భద్రత కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌, హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాను కలిశారు.

రెండేళ్లుగా రాష్ట్రానికి, తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని.. ఇప్పుడు పార్లమెంటు స్థాయి సంఘం పర్యటనకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. వచ్చే నెల 4న ప్రధాని తన నియోజకవర్గ పర్యటనకు రానున్న నేపథ్యంలో… తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉన్నందున.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. తగిన భద్రత కల్పించాలని హోంశాఖ సహాయ మంత్రి, కార్యదర్శిలను కోరారు.

జులై 4న విశాఖ, భీమవరంలలో మోడీ పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు భీమవరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బీజేపీ భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని, ప్రసంగిస్తారు.

అల్లూరి సీతారామరాజు స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని పాండ్రంగా గ్రామం. చింతపల్లి అడవుల్లో ఆయన పోరాటం చేశారు. బ్రిటిష్ వారి చేతుల్లో ఆయన మరణించింది కూడా విశాఖ ఏజెన్సీలోనే. కొయ్యూరు గ్రామంలో ఆయన చనిపోయారు. అల్లూరి జీవితం మొత్తం విశాఖ, విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంది. అందువల్ల అల్లూరి ఉత్సవాలు భీమవరంలో నిర్వహిస్తున్నప్పటికీ… విశాఖకు వస్తున్న మోదీ భీమవరం కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు.