కేసులు నాకు కొత్తమీ కాదు – జూబ్లీహిల్స్ ఘటన పట్ల రఘునందన్ స్పందన

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన పట్ల బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ మరోసారి స్పందించారు. అత్యాచార బాధితురాలి ముఖం కానీ పేరు ఆమె పేరును కానీ నేను ఎక్కడ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి ఎంఐఎం నాయకులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు దోషులను తప్పించాలనే దుర్మార్గమైన కుట్ర జరుగుతోందని రఘునందన్‌రావు విమర్శించారు.

కేసులు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని, తన తప్పుంటే కేసు పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మాజీ మంత్రులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని.. వారు మానసిక ఆనందం పొందుతున్నారని అన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అరెస్టు కోసం ఆందోళన చేయాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అన్నీ ఒకే తానులో ముక్కలని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు. బాలికను రేప్ చేసిన కేసులో హోంమంత్రి మనమడు ఉన్నాడని తానెప్పుడూ ఆరోపణలు చేయలేదన్నారు.

ఇక ఈ కేసు విషయానికి వస్తే..ఈ కేసులో నిందితులు వాడిన బెంజ్,ఇన్నోవా కార్లను ఫోరెన్సిక్ అధికారులు రెండోసారీ తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి ఒకరిని రిమాండ్ పంపగా.. ముగ్గురు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు. మరో నిందితుడి కోసం వెతుకుతున్నారు. బెంజ్ కారు ఫోటోలు బయటకు రావడంతో.. అందులో ఉన్నది పాతబస్తీ ఎమ్మెల్యే కొడుకేనన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.అఘాయిత్యం జరిగింది ఇన్నోవా కారులోనేనని చెప్పిన పోలీసులు.. బెంజ్ కారులో అబ్బాయిలు, అమ్మాయితో ఉన్న వీడియోలు,ఫోటోలు బయటకు రావడంతో భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.