పోలవరంపై ఏపీ అసెంబ్లీలో రగడ

పోలవరంపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో మూడో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు వలన ముంపునకు గురైన నిర్వాసితుల భూములకు పరిహారంపై టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు వలన ముంపునకు గురైన నిర్వాసితుల భూములకు నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు రూ.10 లక్షల ఇస్తామని జీవో ఇచ్చిన మాట వాస్తవమేనా అని టీడీపీ సభ్యులు అడగ్గా.. అది వాస్తవం కాదని మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు. దీనిపై టీడీపీ సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో నేరుగా ఈ అంశంపై సీఎం జగన్ స్పందించారు.

పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ కింద రూ.6.86 లక్షల పరిహారం గతంలో ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే దాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 3073 మందికి పునరావాసం కింద కేవలం రూ.193 కోట్టే ఖర్చుచేశారని, అదే తమ ప్రభుత్వం గత మూడేండ్లలో 10,330 మందికి పునరావాసం కింద రే.1773 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.1960.95 కోట్ల వ్యయంతో 14,110 మంది నిర్వాసితుల పునరావాసం పూర్తయిందని, పునరావాసం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో జరిగిన, వైసీపీ హయాంలో జరుగుతున్న తీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ ప్రాజెక్టును సర్వనాశనం చేశారని జగన్‌ దుయ్యబట్టారు. చంద్రబాబు నాశనం చేసిన ప్రాజెక్టను రిపేర్‌ చేసేందుకు చాలా కుస్తీలు పట్టాల్సి వస్తుందని విమర్శించారు.