మెక్సికో ఓపెన్‌ విజేత రాఫెల్‌ నాదల్‌

బహుమానంగా 3,72,785 డాలర్లు

Rafael Nadal win mexico open title
Rafael Nadal win mexico open title

అకాపుల్కో: ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌.. ఈ ఏడాది తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం ముగిసిన మెక్సికో ఓపెన్‌ ఏటీపీ-500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నాదల్‌ 6-3, 6-2తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలిచాడు. టైటిల్‌ గెలిచే క్రమంలో నాదల్‌ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి సెట్‌‌లో తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన నడాల్ 5-4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత వరుస పాయింట్లు సాధించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. సెకెండ్ సెట్‌లో రెండు సార్లు ఫ్రిట్జ్ సర్వ్‌ను బ్రేక్ చేసిన నడాల్ మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సాధించాడు. మెక్సికో ఓపెన్‌ను నాదల్‌ నెగ్గడం ఇది మూడోసారి. గతంలో నాదల్‌ 2013, 2015లలో విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా నాదల్‌ కెరీర్‌లో ఇది 85వ సింగిల్స్‌ టైటిల్‌. తాజా టైటిల్‌తో నాదల్‌ వరుసగా 17వ ఏడాది కనీసం ఒక టైటిల్‌ను సాధించినట్లయింది. విజేతగా నిలిచిన నాదల్‌కు 3,72,785 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 69 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/