బాహుబలి-2 ట్రైలర్ రికార్డు ను బ్రేక్ చేసిన రాధే శ్యామ్

తన రికార్డు ను తానే బ్రేక్ చేసాడు ప్రభాస్. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా..అన్ని భాషల్లో ఈ ట్రైలర్ కు విశేష స్పందన వస్తుంది. ప్రతి ఫ్రేమ్​ ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటూ.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం బాహుబలి-2 ట్రైలర్​ సాధించిన రికార్డును తిరగరాసింది.

ట్రైలర్ విషయానికి వస్తే..’అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు’ అని చెప్పడంలో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ప్రేమ పెళ్లి అనే వాటికి తావు లేకుండా కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేసే యువకుడిగా ప్రభాస్ కనిపించాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి పుజా హెగ్డే (ప్రేరణ) వస్తుంది. ‘నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు..’ అంటూ ఆమెను ముద్దుల వరకూ తీసుకొచ్చాడు.

అదే సమయంలో ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా.. పామిస్ట్రీకి ఐన్ స్టీన్ ప్రభాస్ ను పరిచయం చేసారు. ‘పుట్టుక నుంచి చావు దాకా.. ఏ రోజు ఏమి జరుగుతుందో నాకు బాగా తెలుసు’ అంటూ తన పాత్ర స్వభావాన్ని తెలియజేసారు.

‘ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్నెంత చదవ గలవో చూస్తాను’ అంటూ ప్రేరణ తన చేయి అందించింది. దీనికి ‘కాలం రాసిన చందమామ కథలా నీ ప్రేమకథ ఉంటుంది.. నీ ప్రేమ ఎదురవడం వరం కాని దాన్ని అందుకోవడం మాత్రం యుద్ధం’ అని ప్రభాస్ చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. ‘విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?’ అని ప్రభాస్ చెప్పే డైలాగ్ ‘రాధే శ్యామ్’ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది. విక్రమాదిత్య – ప్రేరణలు విధిని ఎదిరించి ఒకటయ్యారా లేదా? వీరి ప్రేమకథ చివరకు ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథగా తెలుస్తోంది. ట్రైలర్ బట్టి చూస్తే సినిమాలో చాల ట్విస్ట్ లు ఉన్నట్లు అర్ధమవుతుంది.

1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

YouTube video