సెమీస్ పోరులో సింధు ఓటమి

రేపు కాంస్యం కోసం ఆడనున్న సింధు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే) తో ఈ మధ్యాహ్నం జరిగిన పోరులో సింధు 18-21, 12-21తో పరాజయం చవిచూసింది. తొలి గేమ్ లో పోరాడిన సింధు, రెండో గేమ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, ఆపై క్రమేణా మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. శక్తిమంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్టు ఆటతీరుతో తై జు యింగ్ మ్యాచ్ ను తన వశం చేసుకుంది. ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో ఆడనుంది.

కాగా, ఏడో ర్యాంకర్ అయిన సింధు- తై జు 18 సార్లు తలపడగా 13సార్లు తై జునే నెగ్గింది. 5సార్లు మాత్రమే సింధు ఆమెపై పైచేయి సాధించింది. అయితే, 2016 రియో ఒలింపిక్స్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్, 2018 ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో వంటి కీలక టోర్నీల్లో తై జును ఓడించి సింధు సత్తా చాటింది. దీంతో అదే జోరును ఇప్పుడు కూడా చూపుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/videos/