దమ్ముంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలనీ పొంగులేటికి పువ్వాడ అజ‌య్ స‌వాల్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫై బిఆర్ఎస్ నేతలు వరుస పెట్టి సవాళ్లు విసురుతున్నారు. గత కొద్దీ రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం పేరిట తన అనుచరులను కలుస్తూ..బిఆర్ఎస్ ఫై పలు విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అశ్వరావుపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడుతూ..వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మొన్నటి వరకు పార్టీ అన్ని కార్యక్రమాలకు ఆహ్వానించారని, మీ గెలుపు కోసం తనని ప్రాధేయపడ్డారని, కానీ ఇప్పుడు తనకి బిఆర్ఎస్ సభ్యతమే లేదని అంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అధికారం ఎవ్వడి అబ్బ సొమ్ము కాదని.. ప్రజా తీర్పే అంతిమ అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ కూడా 20 శాతమే చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడగు వేయను అని స్పష్టం చేశారు. నాడు కురుక్షేత్రంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారని, కానీ నేడు శీనన్న వెంట లక్షలాది హృదయాల మద్దతు ఉందని, ఆ తుపానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు కౌంటర్ ఇవ్వడం జరిగింది. పొంగులేటికి బీఆర్‌ఎస్ పార్టీ ఏం అన్యాయం చేసిందో బహిరంగ చర్చ కు రావాలని మధు డిమాండ్ చేశారు. పొంగులేటి చేసే రాజకీయాలన్నీ వెన్నుపోటు రాజకీయాలేనని ఆరోపించారు.

ఇక ఇప్పుడు మంత్రి పువ్వాడ సైతం పొంగులేటి కి సవాల్ విసిరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ద‌మ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి అని పువ్వాడ అజ‌య్ స‌వాల్ విసిరారు. ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పువ్వాడ పాల్గొని ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ద్వారా గెలిచి పొంగులేటికి వంత పాడుతున్న నేత‌లంతా త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి అని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న వారంతా కేసీఆర్‌కు విధేయులే. నా బ్రాండ్ నా గ్రూప్ అంటే కుద‌ర‌దు అని పువ్వాడ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్.. పొంగులేటి లాంటి వ్య‌క్తుల‌ను రాష్ట్రంలో ఎంతో మందిని చూశారు. కేసీఆర్ నీడ నుంచి వెళ్లిన వారికి రాజకీయ జీవితం లేకుండా పోయింది. కేసీఆర్ త‌యారు చేసిన నాయ‌కులు చాలా పెద్ద‌వాళ్లం అనుకుంటున్నారు. ఒక్కసారి కేసీఆర్ చేయి వ‌దిలేస్తే వారి గ‌తి అధోగ‌తే అని హెచ్చ‌రించారు. కొంద‌రు పార్టీలు కూడా పెట్టారు. ఆ పార్టీలు పాన్‌డ‌బ్బాలుగా మారిపోయాయ‌ని విమ‌ర్శించారు.