ఉక్రెయిన్ విషయంలో పుతిన్ పొరపాటు పడ్డారుః జో బైడెన్

యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి ఉందని వ్యాఖ్య

joe-biden

వాషింగ్టన్ః రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో పొరపాటు పడ్డారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. సీఎన్ఎన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ను ప్రమాదకరమైన ఆయుధాలతో ధ్వంసం చేసే ముందు… ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆయన ప్రయత్నిస్తే మంచిదని అన్నారు. ఉక్రెయిన్ లోని పౌరులను టార్గెట్ గా చేసుకుని రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

ఉక్రెయిన్ చేతులు చాచి రష్యాను ఆహ్వానిస్తుందని పుతిన్ భావించారని తాను అనుకుంటున్నానని… ఇదే ఆయన చేసిన పొరపాటు అని అన్నారు. యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తోందని… ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ఆయన అంచనాలు తప్పడంతో అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పుతిన్ అద్భుతంగా నటిస్తున్నారని చెప్పారు.

పుతిన్ తో సమావేశం కావాలనే ఆలోచన తనకు లేదని బైడెన్ అన్నారు. ఒక వేళ జీ20 సమావేశాల్లో తనతో పుతిన్ మాట్లాడితే… తాను ఉక్రెయిన్ అంశంపై చర్చించబోనని… బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రిట్నీ గ్రైనర్ ను విడుదల చేయాలని మాత్రమే అడుగుతానని తెలిపారు. మాదకద్రవ్యాలను రష్యాలోకి స్మగ్లింగ్ చేస్తోందనే ఆరోపణలతో ఆమెను రష్యా అరెస్ట్ చేసింది. ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్షను విధించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/