మండలి భేటికి రష్యా అధ్యక్షుడి పిలుపు

జెరూసలేం : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల నేతలు భేటీ కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యం, లిబియా, ఉక్రెయిన్ సంక్షోభాల పరిష్కారం విషయంలో రష్యా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ పిలుపునివ్వటం గమనార్హం. గురువారం ఇక్కడ జరిగిన ఆశ్చ్‌విజ్ విముక్తి 75 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల నేతలు ప్రపంచంలో ఎక్కడైనా భేటీ కావచ్చని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దేశాలు ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార సాధనలో సహకరించాల్సిన అవసరం వుందన్నారు. ఐరాస వ్యవస్థాపక సభ్యులైన ఈ ఐదు దేశాలు ప్రపంచ నాగరికతను పరిరక్షించే ప్రత్యేక బాధ్యతను కలిగి వున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులకు సమిష్టిగా బదులిచ్చేందుకు ఈ ఐదు దేశాలు సమిష్టిగా ముందడుగు వేయాలని అన్నారు. ఇటీవల బెర్లిన్, మాస్కోలలో జరిగిన శాంతి చర్చల నేపథ్యంలో ఈ భేటీకి లిబియా పరిస్థితి అజెండాగా వుంటుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/