రూ. 100 కోట్ల క్లబ్ లో పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక అంటే అభిమానులకు పెద్ద పండగే. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య2’ వంటి ఫీల్ గుడ్ సినిమాలు చేశారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ‘పుష్ప’ అనే చిత్రంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పక్కా మాస్ కమర్షియల్ మూవీగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో దక్కుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అందర్నీ ఆశ్చర్య పరిచింది.

తెలుగురాష్ట్రాలు సహా ఇరుగు పొరుగునా ఉత్తరాదినా పుష్ప అత్యంత భారీగా విడుదలైంది. అయితే హిందీ వెర్షన్ కి ఆశించిన వసూళ్లు లేవన్న టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో పూర్తి కలెక్షన్లు రాబడుతుండగా ఇతర రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండవ రోజు వసూళ్ల లెక్కలు బావున్నాయని తెలిసింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత లవ్ స్టోరి- అఖండ చిత్రాలు చక్కని వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఇదే వరుసలో పుష్ప అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అమెరికాలో ఇప్పటికే పుష్ప హవా సాగుతోంది. అక్కడ ప్రీమియర్లు కలుపుకుని ఇప్పటికి 9కోట్లు (1.3 మిలియన్లు) వసూలు చేసింది. 2 మిలియన్ల క్లబ్ లో చేరడం కష్టమేమీ కాదని అంచనా.

పుష్ప’ మూవీకి ఏపీ, తెలంగాణలో రెండో రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 7.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.25 కోట్లు, ఈస్ట్‌లో రూ. 76 లక్షలు, వెస్ట్‌లో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 77 లక్షలు, నెల్లూరులో రూ. 43 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 13.70 కోట్లు షేర్, రూ. 20.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు రోజులకు కలిపి..నైజాంలో రూ. 18.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.05 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.19 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.02 కోట్లు, గుంటూరులో రూ. 2.83 కోట్లు, కృష్ణాలో రూ. 1.92 కోట్లు, నెల్లూరులో రూ. 1.53 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 38.60 కోట్లు షేర్, రూ. 56 కోట్లు గ్రాస్ వచ్చింది.