మహేష్‌తో జనగణమన పాడిస్తున్న పూరీ.. ఈసారి పక్కా!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘లైగర్’ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న పూరీ, ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అదిరిపోయే హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత పూరీ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే ప్రశ్నకు అతి త్వరలోనే సమాధానం లభించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్‌మెన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన పూరీ, ఇప్పుడు మరోసారి మహేష్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనగణమన’ అనే సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. దీంతో ఈ కాంబోలో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇటీవల పూరీ తనకు కథ చెబితే సినిమా చేయడం ఖాయమని మహేష్ హింట్ ఇచ్చాడు.

దీంతో జనగణమన చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును మార్చి పర్ఫెక్ట్ కథతో మహేష్ ముందుకు వెళ్లాలని పూరీ చూస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను అతిత్వరలో అనౌన్స్ చేసి పట్టాలెక్కించాలని పూరీ భావిస్తున్నాడు. మరి ఈసారైనా మహేష్ జనగణమన పాడతాడా లేడా అనేది చూడాలి.