పౌరసరఫరాల ప్రక్షాళనే పరిష్కారం

వాస్తవాలు పరిశీలిస్తూ విస్తుపోయే నిజాలు

Public distribution system
Public distribution system

ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు కొంతలో కొంత సహకారం అందించి ఆదుకునే పవిత్ర ఆశయంతో ప్రవేశపెట్టిన ప్రజాపంపిణీ వ్యవస్థ రాజకీయ సుడిగుండంలో చిక్కుకొని కొట్టు మిట్లాడుతున్నది.

మితిమీరిన రాజకీయ జోక్యం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం,అన్నింటికంటే మించి దళారుల ఆధి పత్యంతో పేదల కంటే పెద్దలకే ఈ వ్యవస్థ కల్పతరువు గా మారిందేమోననిపిస్తున్నది.

ఆకలితో అల్లాడుతున్న అన్నార్తులకు ఏటా వేలాది కోట్ల రూపాయల సబ్సిడీతో అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి.

ఈ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు, ముఖ్యంగా ఓటర్ల ను ఆకర్షించేందుకు ఉపయోగించుకోవడం పెరిగిపోతుండ టంవల్లనే ఈ పరిస్థితి దాపురిస్తున్నది.

ఈపార్టీ ఆ పార్టీ అనికాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పథకంలో పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారిపడుతున్నాయి. ఇటీ వల కాలంలో రెండు తెలుగురాష్ట్రాల్లో కూడా భారీఎత్తున పట్టుబడుతున్నాయి.

కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు.అయినా ఇవేమీ ఆగడం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వ విధానంలోనే లోపం ఉందేమోననిపి స్తున్నది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సన్నబియ్యానికిబాగా అలవాటుపడిపోయారు.

నిరుపేదలు సైతం ఒక్కపూట తిన్నా సన్నబియ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో పండుతున్న ధాన్యంలో కూడా సన్న రకమే అధిక శాతం ఉంది.

కానీ నిరుపేదలకు అందిస్తున్న బియ్యం దొడ్డురకం కావడం వల్ల అవి తినేందుకు ఇష్ట పడటం లేదు.

చివరకు ఇటీవల కరోనా సమయంలో ఉచితంగా బియ్యం ఇస్తున్నా ఆ బియ్యాన్ని అమ్ముకొని తిరిగి సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వం ఇస్తున్న దొడ్డు బియ్యం కొన్ని ప్రాంతాల్లో పది రూపాయ లకు కిలో, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రూపాయలకు కూడా తెగనమ్ముకుంటున్నారు.

ఇలా నిరుపేదల దగ్గర కొన్న బియ్యం కొందరు దళారులు తిరిగి మరికొంత పాలిష్‌ చేసి కొత్త సంచుల్లో నింపి తిరిగి ప్రభుత్వానికో లేక మార్కెట్‌కో తరలించుకుంటున్నారు. ఇది పెద్దఎత్తున జరుగుతున్నది.

మరికొంత బియ్యం ఇతర రాష్ట్రాలకు కూడా తరలిపోతున్నది. అలా తరలిపోతూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దువద్ద పట్టుబడిన సంఘట నలు కూడా ఉన్నాయి.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబడ్డ బియ్యం మద్యం తయారీకి ఉపయోగిస్తున్నారనే సరికొత్త విషయం బయటపడింది.

ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో దొడ్డు బియ్యం తినడం అలవాటు ఉండటంతో దళారులు ఈ బియ్యాన్ని అక్కడికి తరలిస్తున్నారు.

మరికొన్ని సంద ర్భాల్లో అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో పండిన ముతక దొడ్డు బియ్యాన్ని చౌక దుకాణాల ద్వారా నిరుపేదలకు అందిస్తు న్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.

వాస్తవంగా ప్రజలు అలవాటు పడిన సన్నబియ్యాన్నే పంపిణీ చేయ గలిగితే పాలకులు ఆశించిన లక్ష్యం చాలావరకు నెరవేరు తుంది.

అంతేకానీ నిరుపేదలకు ఇష్టంలేని,తినలేని బియ్యా న్ని అంటగడితే అది నిరుపయోగమై లక్ష్యానికి దూరమై దళారులకు కల్పతరువుఅవుతున్నది.

ఇక రాజకీయ ప్రయోజనాల ఆశతో కార్డుల పంపిణీచేసి మొత్తం వ్యవస్థ నే అస్తవ్యస్తం చేశారు.

అందుకే ఒకపక్క పేదల అభ్యున్న తికి సంక్షేమానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వారిని దారిద్య్రరేఖ నుంచి దాటించేందుకు ఎనలేని కృషి చేస్తున్నట్లు వివరిస్తున్నా పెరుగుతున్న తెల్లకార్డులు, పుట్టుకొస్తున్న కుటుంబాలసంఖ్య చూస్తే ఈ నిధులు ఏమైపోతున్నాయోననే ఆందోళన కలగతప్పదు.

అసలు పౌరసరఫరాల శాఖకు సుదీర్ఘచరిత్ర ఉంది.

మన పెద్దలు ఎంతో ముందుచూపుతో ఏర్పాటు చేసిన పౌరసర ఫరాల విభాగం 1946నుంచి1952 వరకు అప్పటి హైద రాబాద్‌ రాష్ట్రంలో హైదరాబాద్‌ కమర్షియల్‌ కార్పొరేషన్‌ గా పనిచేస్తూ ఉండేది.

1952లో పౌరసరఫరాల శాఖ ఏర్పాటు అయినా 1958జులై ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల శాఖగా ఆవిర్భవించింది. ఈశాఖ మొదట్లో రెవెన్యూ బోర్డు విభాగంలో ఉండేది.

1977లో రెవెన్యూ బోర్డు రద్దుకావడంతో పౌరసరఫరాల శాఖకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

1983లో రెండురూపా యలకు కిలో బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత ప్రాధా న్యత మరింత పెరిగిందనిచెప్పొచ్చు.

కానీ కార్డుల పంపిణీ,డీలర్ల నియామకం,పంపిణీల్లో రాజకీయజోక్యం పెరిగిపోవడంతో అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి అంతులేకుండా పోయింది.

ఇంతకాలం జరిగినా,కార్డుల వ్యవహారం ఇప్ప టికీ గందరగోళంగానే ఉన్నది.

లక్షలాది బోగస్‌ కార్డులున్నా యని,మరెందరో అనర్హులు ఈ సబ్సిడీ బియ్యాన్ని భోం చేస్తున్నారని కోట్లాది రూపాయలు ప్రజాధనం దళారుల పాలవుతుందని స్పష్టంగాతెలిసినా నిర్దిష్టమైన చర్యలవైపు అడుగులు వేయలేకపోతున్నారు.

కళ్లముందు జరుగుతున్న ఈ దోపిడీకి నేతలు సాక్షులుగా ఉంటున్నారు.

ఇప్పటికైనా నేతలు మనసుపెట్టి ఆలోచించాలి.రాజకీయ అవసరాల కోసం ఈవ్యవస్థను అస్తవ్యస్తంచేయడం సమంజసంకాదు

నిజమైనఅర్హులను నిర్ణయించి పేదలకు తెల్లకార్డులు ఇవ్వాల్సిందే.అందులో వాదనకు తావులేదు.

కానీ నిరుపేదల పేర్లపై ఏపరిస్థితుల్లోనూ దళారులు భోంచేయడాన్ని అనుమతించకూడదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను తెప్పించుకొని పరిశీలిస్తే ..

విస్తుపోయేవిషయాలు వెలుగులోకి వస్తాయి.ఒకపక్క వేలాది కోట్ల అప్పు తెచ్చుకుంటూ ఇంత పెద్దఎత్తున దుర్వినియోగాన్ని అనుమతించడం ఎంతవరకు సమంజసమో పాలకులు విజ్ఞతతో ఆలోచించాలి.

-దామెర్ల సాయిబాబ

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/