తనకు భద్రత కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన మరో పంజాబ్ సింగర్

ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా మృతి చెందిన సంగతి తెలిసిందే. కార్ లో వెళ్తున్న సిద్ధూ ను వెబడించి అతి దారుణంగా తుపాకీ తో కాల్చి చంపారు. ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధూ మూసేవాలాకు భద్రత తొలగించిన మరుసటి రోజే ఈ హత్య జరగడం గమనార్హం. ఈ హత్య తో మరో సింగర్ తనకు భద్రత కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

పంజాబీ గాయకుడు మన్ కీర్త్ ఔలాక్ తనకు భద్రత కావాలంటూ తెరపైకి వచ్చాడు. ఔలాక్ ను చంపేస్తామంటూ ఏప్రిల్ నెలలో బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో, తనకు పంజాబ్ పోలీసులు మరింత మెరుగైన భద్రత కవచం ఏర్పాటు చేయాలని మన్ కీర్త్ ఔలాక్ కోరుతున్నాడు.

పంజాబ్ లో ప్రధానంగా లారెన్స్ బిష్ణోయ్, దేవిందర్ బంభియా ముఠాల మధ్య గ్యాంగ్ వార్ లో మూసేవాలా వంటి వారు బలవుతున్నట్టు భావిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ జైలుకు వెళ్లడంతో, గోల్డీ బ్రార్ ఆ ముఠా బాధ్యతలు చూస్తున్నాడు. మూసేవాలా హత్యకు తానే బాధ్యుడ్ని అంటూ గోల్డీ బ్రార్ ఫేస్ బుక్ లో ప్రకటించుకోవడం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ వికీ మిద్దుఖేరా మృతికి ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను చంపినట్టు గోల్డీ బ్రార్ పేర్కొన్నాడు.

ఇక సింగర్ సిద్ధూ మూసేవాలా అంత్యక్రియలు వేల మంది అభిమానుల మధ్య జరిగాయి. సిద్ధూ సొంత గ్రామమైన మాన్సా జిల్లాలోని మూసాలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన మాన్సా సివిల్ ఆస్పత్రి నుంచి సిద్ధూ మృతదేహాన్ని మంగళవారం ఉదయం పటిష్ఠ బందోబస్తు మధ్య మూసాకు తీసుకొచ్చారు. సిద్ధూకు ఇష్టమైన ట్రాక్టర్​లోనే మృతదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు.

తమ అభిమాన సింగర్​ను చివరిసారి చూసుకునేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొంతమంది అభిమానులు సిద్ధూ ఫొటో ఉన్న టీషర్టులను ధరించి దహన సంస్కారాలకు హాజరయ్యారు. వీరిని చూసేందుకు సిద్ధూ తండ్రి బల్​కౌర్ సింగ్ తన తలపాగాను సైతం తొలగించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరిందర్ సింగ్ రాజా వారింగ్.. అంత్యక్రియలకు హాజరయ్యారు.