‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ ఎఫెక్ట్ : ఒకటి నుంచి 7వ తరగతి వరకు పాఠశాలలు మూసివేత

ఒమిక్రాన్‌ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకునేలోపే ఈ కొత్త వేరియంట్ సౌత్ ఆఫ్రికా లో పుట్టుకొచ్చింది. ఈ మహమ్మారి వల్ల అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు విమాన సర్వీసులను రద్దు చేసాయి. ఇప్ప‌టికే 13 దేశాల్లో పాగావేసి ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌పై రేపు లోక్‌స‌భ‌లో చ‌ర్చ జరుగ‌నుంది. రూల్ 193 కింద రేపు లోక్‌స‌భ‌లో ఒమిక్రాన్‌పై చ‌ర్చ జరుగుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటె ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ కారణంగా పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని డిసెంబర్‌ 15 వరకు పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాయిదా వేసింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించిన అనంతరం పాఠశాలల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇంతకు ముందు డిసెంబర్‌ 1 నుంచి పాఠశాలలను పునః ప్రారంభించాలని ఆదేశించింది. గతంలో కరోనా కారణంగా అన్ని దేశాలు విద్యాసంస్థలను మూతవేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర వరకు స్కూల్స్ , కాలేజీలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి అనుకునేలోపే ఈ కొత్త వేరియంట్‌ బయటకొచ్చింది. మరి దీనివల్ల ఏంజరుగుతుందో చూడాలి.