పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం!

pulwama attack
pulwama attack

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రదాడికి పథకం రచించిన ప్రధాన సూత్రధారి ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు తెలుస్తుంది. త్రాల్‌లోని పింగ్లిష్‌ ప్రాంతంలో నిన్న జరిగిన ఎదురుకాల్పులో జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదాసిర్‌ ఆహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ హతమై ఉంటాడని విశ్వసిస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. అయితే పింగ్లిష్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతాసిబ్బంది ఆదివారం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. తనిఖీలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతాబలగాలపైకి కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని అధికారులు తెలిపారు. హతుల్లో ఒకరిని ముదాసిర్‌ అహ్మద్ ఖాన్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడికి అహ్మద్‌ కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. పుల్వామా దాడిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అహ్మద్‌ ఖాన్‌ గురించి అనేక విషయాలు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలను, వాహనాన్ని ఏర్పాటుచేసింది అహ్మద్‌ ఖానే.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/