తెలుగు రాష్ట్రాల్లో నేడు పల్స్ పోలియో

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఐదేళ్ల వయసులోపు చిన్నారులు 52.27 లక్షల మంది ఉన్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. వీళ్లందరికీ విధిగా పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల మందు బూత్‌లలో అందుబాటులో ఉంటుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ ఆదివారం ఎవరైనా చిన్నారులకు వేయించలేని పరిస్థితి ఉంటే ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/