పీఎస్ఎల్వీ సి49 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

రేపు మధ్యాహ్నం 3.02 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్వీ సి49

pslv-rocket-launching-in-sriharikota

శ్రీహరికోట: రేపు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి49 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం కోసం ఈ మధ్యాహ్నం 1.02 గంటలకు మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం రేపు మధ్యాహ్నం 3.02 గంటలకు జరగనుంది. అప్పటివరకు కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగనుంది.

ఇస్రోకు నమ్మదగిన నేస్తంగా పేరుగాంచిన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భారత్ కు చెందని ఈఓఎస్ఓ1 ఉపగ్రహంతో పాటు మరో 9 అంతర్జాతీయ వాణిజ్య ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈఓఎస్01 ఓ నిఘా ఉపగ్రహం. ఇందులోని సింథటిక్ అపెర్చర్ రాడార్ ద్వారా భూమిపై కొద్దిపాటి కదలికలను కూడా గుర్తించవచ్చు. ముఖ్యంగా, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, ఇస్రో తన ప్రకటనలో వ్యవసాయం, అటవీభూముల పరిశీలన, విపత్తు నిర్వహణలకు మద్దతు వంటి అంశాలకు ఈఓస్01 తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.

 కొవిడ్ -19 మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించాయి. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/