ఏపి వ్యాప్తంగా తెలుగు యువత నిరసనలు

protests-across-the-state-to-release-the-job-calendar-in-ap

అమరావతిః ఏపిలో నిరుద్యోగుల కోసం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేడు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఏపీ సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని పలు జిల్లాలో వినూత్న నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని యువత నాయకులు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమోటాలు అమ్మి నిరసన తెలుపగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కారు తుడిచి, చెప్పులు కుట్టి, ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని జగన్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

తిరుపతి, కడప జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. జాబ్‌లు రావాలంటే జగన్‌ పోవాలని నినాదాలు చేశారు. తిరుపతిలో రిక్షాలు తొక్కుతూ నిరసనలు చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌ చేపట్టకపోవడంలో ప్రతిభ గల నిరుద్యోగులు రిక్షాలు, ఆటోలు తోలవలసి వస్తుందని తెలిపారు. కడపలో నిర్వహించిన నిరసనలో పోలీసులు తెలుగు యువత నాయకులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/