అమెరికా రాయబార కార్యాలయానికి నిప్పు

American embassy
American embassy

వాషింగ్టన్‌/బాగ్దాద్‌ : తమ దేశంపై అమెరికా చేసిన వైమానిక దాడులను నిరసిస్తూ ఇరాకీ ఆందోళన కారులు నగరంలోని అమెరికా రాయబార కార్యాలయానికి నిప్పు పెట్టారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దౌత్య కార్యాలయంలోకి చొచ్చుకుపోయిన ఆందోళనకారులు ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి రిసెప్షన్‌ ప్రాంతంలో నిప్పు పెట్టారు. దీనితో వారిని చెదరగొట్టేందుకు అక్కడి భద్రతా దళాలు ముందుగా బాష్పవాయు గోళాలు ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోవటంతో కాల్పులు జరిపాయి. రాయబార కార్యాలయ భవన సముదాయం లోపల మంటలు చెలరేగుతుండటంతో కనీసం ముగ్గురు సైనికులు భవనం కప్పుపైకెక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దౌత్య కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేయటంతో అక్కడి నుండి తమ సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని అమెరికా రాయబారి అధికారులను ఆదేశించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ప్రధాని ఆదెల్‌ అబ్దుల్‌ మహదీ ఆందోళనకారులు అక్కడి నుండి వెంటనే వెళ్లిపోవాలని విజ్ఞప్తిచేశారు. విదేశీ దౌత్య కార్యాలయాలపై దాడులు, అక్కడి సిబ్బందిని వేధింపులకు గురిచయటం వంటి చర్యలను భద్రతా దళాలు కఠినంగా అణచివేస్తాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/