రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

farmers
farmers

అమరావతి: ఏపి రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రైతుల బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా వ్యాపార, విద్యాసంస్థలను మూసివేశారు. వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి రోడ్ల దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలను జారీ చేస్తున్నట్లు తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని అంశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సచివాలయం వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.అనుమానితుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అయితే ఆందోళన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాలపై ఇప్పటికే రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/