విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల ఆందోళన..

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. ట్రైన్ లో వాటర్ రావడం లేదంటూ విశాఖ లో ట్రైన్ ను ప్రయాణికులు నిలిపేశారు. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీల్లో నీళ్లు రాకపోవడంతో పలువురు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో విశాఖపట్నంలో రైలు కాసేపు నిలిచిపోయింది. రైలు విశాఖపట్నం చేరుకున్న 20 నిమిషాల తర్వాత తిరిగి భువనేశ్వర్‌ వైపు బయల్దేరుతుండగా ప్రయాణికులు గొలుసు లాగి నిలిపేశారు.

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరినప్పటి నుంచి నీళ్లు రాకపోవడంతో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, అయితే విజయవాడలో నీరు నింపుతామని చెప్పి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వచ్చిన తర్వాత కూడా నీరు రాలేదని, మళ్లీ ఫిర్యాదు చేస్తే విశాఖపట్నంలో నింపుతారంటూ చెప్పుకొచ్చారని తెలిపారు. వైజాగ్ వచ్చాక కూడా బోగీల్లో నీళ్లు నింపకపోవడంతో అసహనానికి గురైన ప్రయాణీకులు రైలును కదలనివ్వకుండా అడ్డుపడ్డారు.

ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారికి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. నిరసన చేపట్టడంతో 15 నిమిషాల పాటు రైలు విశాఖ స్టేషన్‌లో నిలిచిపోయింది. మరోవైపు రైల్వే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమ్మెలో ఉండటంతో విశాఖపట్నంలోనూ నీరు నింపడం సాధ్యపడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకుల నిరసన నడుమే రైలు ముందుకు కదిలింది.. రైల్వేశాఖ తీరు, సమన్వయ లేమిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.