ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ చొర‌వ‌..

Producers guild press meet

నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోసం ఏర్ప‌డిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌ల విష‌యంలో నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది. సినిమాల రిలీజ్ విష‌యంలో క్లాష్ రాకుండా కీల‌క పాత్ర పోషించిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్…. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `సరిలేరు నీకెవ్వ‌రు`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ `అల‌..వైకుంఠ‌పుర‌ములో..` సినిమా రిలీజ్ డేట్స్ క్లాష్ రాకుండా మ‌రోసారి కీల‌క పాత్ర పోషించింది. రెండు చిత్రాల నిర్మాత‌లు అనిల్ సుంక‌ర‌, ఎస్‌.రాధాకృష్ణ‌ల‌తో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ చ‌ర్చ‌లు జ‌రిపింది. చ‌ర్చ‌ల అనంత‌రం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం జ‌న‌వ‌రి 11న విడుల‌వుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ` అల‌..వైకుంఠ‌పుర‌ములో..` జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో గిల్డ్ త‌ర‌పున నిర్మాత‌లు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌, రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.

కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “రెండు, మూడు రోజులుగా సంక్రాంతి సినిమాల విడుద‌లపై చిన్న పాటి సస్పెన్స్ ఉంది. చ‌ర్చ‌ల అనంత‌రం సినిమా విడుద‌ల తేదీపై క్లారిటీ వ‌చ్చింది. కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు. చివ‌ర‌కి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌డ‌మే ముఖ్యం. స‌మ‌స్య‌లుంటే చాలా మంది ఇబ్బందులు ప‌డ‌తారు. ఈరోజు జ‌రిగిన మీటింగ్‌లో అంద‌రూ పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు“ అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “నాలుగైదు రోజులుగా స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో సినిమా విడుద‌ల గురించి సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్ జ‌రుగుతుంది. అంత‌కు ముందు జ‌రిగిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మీటింగ్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రుని జ‌న‌వ‌రి 11న‌, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌ల‌తో మాట్లాడి అనౌన్స్ చేశాం. అయితే త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో జ‌న‌వ‌రి 10 లేదా 11న అల వైకుంఠ‌పుర‌ములో విడుద‌ల‌వుతుందని వార్త‌లు వినిపించాయి. దాంతో మ‌రోసారి గిల్డ్ చ‌ర్చ‌లు జ‌రిగాయి. నిర్మాత‌ల‌ను క‌న్విన్స్ చేశాం. పెద్ద సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్పుడు అంద‌రూ బావుండాల‌నే ఉద్దేశంతో గిల్డ్ ఇంత‌కు ముందు చ‌ర్చ‌లు జ‌రిపింది. ఆరోజు అనుకున్న‌ట్లే ఇప్పుడు జ‌రిగిన గిల్డ్ చ‌ర్చ‌ల్లోనూ జ‌న‌వ‌రి 11న స‌రిలేరు నీకెవ్వ‌రు.. జ‌న‌వ‌రి 12న అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను విడుదల చేయ‌డానికి రెండు సినిమాల నిర్మాత‌ల‌ను ఒప్పించాం. హీరోలతో కూడా మాట్లాడాం. రెండు పెద్ద సినిమాల‌తో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా విడుద‌ల‌వుతున్నాయి. గ‌త సంక్రాంతికి స‌క్సెస్‌ఫుల్ మూవీస్ చూశాం. ఈసారి కూడా అన్నీ సినిమాలు బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తే.. పరిష్క‌రించ‌డానికి గిల్డ్ ఎప్పుడూ ముందుంటుంద‌ని తెలియ‌జేస్తున్నాం. ఎందుకు ఈ క‌న్‌ఫ్యూజ‌న్ వ‌చ్చింద‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే, స‌మ‌స్య ఎందుకు వ‌చ్చింది అని ఆలోచించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డ‌మే మా గిల్డ్ టార్గెట్‌. ప్ర‌తి సినిమా ఆడాలి. బాగా రెవెన్యూ రావాల‌నే ఆలోచిస్తాం. ఈ మీటింగ్ ఇంత సామ‌ర‌స్యంగా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన హీరోలు, నిర్మాత‌లు స‌హా ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/