కొత్త జీవోతో బైక్‌షోరూం యజమానులకు తిప్పలు

Bikes
Bikes

హైదరాబాద్‌: తెలంగాణలో అమలు కానున్న కొత్త జీవో కారణంగా బైక్‌షోరూం యజమానులకు తిప్పలు తప్పేలా లేవు. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్‌, నెంబర్‌ ప్లేట్‌ ఏర్పాటు వంటి అంశాలు రవాణా శాఖ పరిధిలోనే ఉండేవి, కానీ ఈ బాధ్యతలను వాహనాలు విక్రయించే షోరూం నిర్వహకులకు అప్పగించి, ఈ మేరకు చట్టంలో మార్పులు చేశారు. వినియోగదారుడు బైకు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించాలని, ఆ తర్వాత మూడు రోజుల్లోనే నెంబర్‌ ప్లేట్‌ అమర్చాల్సిన బాధ్యత నిర్వహకులదేనని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా నెంబర్‌ప్లేట్‌ లేకుండా ఏ వాహనమైనా మొదటిసారి పట్టుబడితే హెచ్చరించి వదిలేస్తామని, కానీ మళ్లీ మళ్లీ పట్టుబడితే జరిమానా విధిస్తామని జీవోలో పేర్కొన్నారు. రెండవసారి పట్టుబడితే రూ. 2 లక్షలు జరిమానా, మూడవసారి రూ. 5 లక్షలు, అంతకు మించి పట్టుబడితే ఏకంగా షోరూం యజమానికి జైలు శిక్ష తప్పదని తెలిపారు. కాగా ఈ విషయంపై స్పందించిన షోరూం నిర్వహకులు జైలుకు పంపేంత నేరమా ఇది? అని ప్రశ్నిస్తున్నారు. నెంబర్‌ప్లేట్‌ విషయంలో బైకు వినియోగదారుడిని బాధ్యుడ్ని చేయాలిగాని, తమను ఎందుకు బలి చేస్తున్నారని వాపోతున్నారు. ఇలాంటి చట్టాల వల్ల తాము వ్యాపారాలు చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/