రేపు సిఎంలతో ప్రధాని మోడి సమావేశం

కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్న ప్రధాని

pm modi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తిపై, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, స్టోరేజ్ సామర్థ్యం, పంపిణీ వ్యూహంపైనా మంగళవారం (రేపు) ప్రధాని నరేంద్రమోడి, రాష్ట్రల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వర్చ్యువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో సిఎంల అభిప్రాయాలను మోడి తెలుసుకోనున్నారని సమాచారం. కొవిడ్19 కేసులు అత్యధికంగా ఉన్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తొలి భేటీ జరుగుతుందని, ఆపై రెండో దశలో మిగతా రాష్ట్రాలతో మోడి చర్చిస్తారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపైనా ప్రధాని మోడి మాట్లాడనున్నారు.

కాగా, ఇప్పటికే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్న ప్రధాని కార్యాలయం, అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ను ప్రకటిస్తుందని సమాచారం. ఈ టాస్క్ ఫోర్స్ వ్యాక్సిన్ల ధర, కొనుగోలు, స్టోరేజ్, పంపిణీ, ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై నియమావళిని రూపొందిస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/